Chinta Gopi Sarma Siddhanthi

జ్యోతిష్యము

ప్రకృతి వైపరిత్యాలు

కళత్ర వియోగము ( kalathra Viyogam )

పురుషుని నుండి పరిశీలిస్తే భార్యా వియోగము అనేది విశేషమైన పరిణామాలకు కారణం అవుతుంది . సంఘంలో భార్యను కోల్పోయిన వారికి ఏర్పడే గృహ సంతాన బాధ్యతలపై , ప్రత్యేకించి జాతకులపై విశేష ప్రభావాన్ని చూపిస్తాయి . ఈ కారణంచేత కళత్రవియోగమే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది . ప్రామాణిక గ్రంధాలలో వివరించిన కళత్రవియోగ సంబంధ గ్రహ యోగాలను పరిశీలిద్దాం . 2,7స్థానములందు పాపగ్రహములన్న భార్యావియోగము ఏర్పడుతుంది .  అందుచేత ఇదే రకమైన గ్రహస్థితులున్న జాతకురాలిని వివాహం చేసుకోవడం ద్వారా పై ఫలితములు తటస్థీకరించబడి దంపతులు సుఖ సంతోషాలతో సంతానంతో జీవిస్తారు , లగ్నమునుండి లేదా చంద్రుని నుండి 5 , 7స్థానములందు పాపగ్రహము ఉన్నను , చూసినను వివాహము కాదు ఒకవేళ వివాహమైనను భార్య జీవించదు . కన్యాలగ్నమై అందు రవి , సప్తమంలో శని ఉన్న భార్య మరణించును . అలాగే సప్తమంలో కుజుడున్నను పై ఫలితమే చెప్పవచ్చును . సప్తమాధిపతి శుక్రుని నుండి సప్తమాధిపతి సప్తమంలో బలము కలిగి ఉండగా , ఎటువంటి పాప గ్రహముల స్థితి వీక్షణలు లేకున్న భార్యాభర్తలు ఇరువురు ఒకేసారి మరణిస్తారు . సప్తమంలో కార్ముకమనే ఉపగ్రహమున్న భార్య లేదా భర్త శీఘ్రముగా మరణిస్తారు

2 , 7స్థానాధిపతులు శుక్రునితో కలసినను , లేదా పాపగ్రహములు వీరితో కలసి ఎస్థానములో ఉన్నను అంతమంది భార్యలు మరణిస్తారు . నవాంశలో శుక్రునికి 7లో కుజుడు , సప్తమాధిపతి 5లో ఉన్నను భార్యా వియోగము కలుగు తుంది . శుక్ర కుజులు ” సప్తమం లో ఉన్న భార్యావియోగం కలుగుతుంది . 1 , 7 , 12లందు పాపగ్రహములుండగా బలహీనమైన చంద్రుడు 5లో ఉన్న భార్య లేక పోవడమో లేదా భార్య సంతాన హీనురాలగును . కుజుడు 2 , 12 , 4 , 6 , 7 స్థానము లందున్న కళత్రమారకమగును.

సప్తమాధిపతి 12వస్థానంలో ఉండగా కారకుడు బలహీనుడైన , సంసార సుఖము తక్కువగా ఉండడం భార్య వియోగమో లేదా భార్యనుండి విడిపోవడమో జరుగుతుంది. విదేశాలలో నష్టాలు పొందుతారు . వీరితో లగ్నాధిపతి కలిసిన భార్యాభర్తలు ఇరువురు విదేశాలలోనే జీవిస్తారు . ఇక్కడ పాపస్థితి ఏర్పడితే జాతకులు భార్యతో కలసి పాపఫుపనులు చేస్తారు . వీరిపై శుభగ్రహదృష్టి ఉన్న సప్తమాధిపతి దశలో ఆధ్యాత్మికచింతన ఎక్కువ గా ఉంటుంది .

జ్యోతిష్యం – ప్రయోజనాలు

మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది. జన్మించిన తేది, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్ సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం.

జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ 3 రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది. దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది.

జ్యోతిష శాస్త్రం ప్రధానంగా 3 విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి. 1. కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని, 2. ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని, 3. ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు.

సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మానవుడుజన్మించిన సమయం, ప్రదేశం ఆధారంగా అతని జాతకచ క్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని లెక్కించడం జరుగుతుంది.

సామాన్యులు కూడా తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా ఆయా నక్షత్ర పాదాలు ఏయే అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందవచ్చు.

మీ జన్మనక్షత్రముద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • అశ్విని – చు, చే, చో, లా
  • భరణి – లీ, లూ, లే, లో
  • కృత్తిక – ఆ, ఈ, ఊ, ఏ
  • రోహిణి – ఓ, వా, వీ, వు
  • మృగశిర – వే, వో, కా, కీ
  • ఆరుద్ర – కూ, ఘ, జ్ఞ, ఛ
  • పునర్వసు – కే, కో, హా, హీ
  • పుష్యమి – హూ, హే, హో, డ
  • ఆశ్రేషా – డీ, డూ, డే, డో
  • మఖ – మా, మీ, మూ, మే
  • పుబ్బ – మో, టా, టీ, టూ
  • ఉత్తర – టే, టో, పా, పీ
  • హస్త – పూ, షం , ణా, ఠా
  • చిత్త – పే, పో, రా, రీ
  • స్వాతి – రూ, రే, రో, తా
  • విశాఖ – తీ, తూ, తే, తో,
  • అనురాధ – నా, నీ, నూ, నే
  • జ్యేష్ఠ – నో, యా, యీ, యూ
  • మూల – యే, యో, బా, బీ
  • పూర్వాషాఢ – బూ, ధా, ఫా, ఢ
  • ఉత్తరాషాఢ – బే, బో, జా, జీ
  • శ్రవణం – జూ, జే, జో, ఖ
  • ధనిష్టా – గా, గీ, గూ, గే
  • శతభిషం – గో, సా, సీ, సూ
  • పూర్వాభాద్ర – సే, సో, దా, దీ
  • ఉత్తరాభాద్ర – దూ, శ్యం , ఝ, థ
  • రేవతి – దే, దో, చా, చీ

ఉదాహరణకు మీరు స్వాతి నక్షత్రం లో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు రూ, రే, రో, తా మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. అంటే.. రూప, రూపేశ్, ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి. పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించవలెను.

గోచారములు – ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.

ఉదాహరణకు… 2014  సెప్టెంబర్‌ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు… ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.

గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.

సూర్యుడు

సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

చంద్రుడు

చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు.

కుజుడు

కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.

బుధుడు

బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .

గురుడు

గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శుక్రుడు

శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .

శని

శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .

రాహు , కేతువులు

రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4  మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .

శుభ యోగములు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి శుభయోగములను, అవయోగములను విపులంగా చర్చించబడింది. ఈ యోగములు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్థితిని బట్టి గ్రహముల కలియికను బట్టి దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి యోగముల బలములు నిర్ణయించాలి.

భాగ్య యోగము

భాగ్య స్థానమును అనగా లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నానూ లేదా శుభ గ్రహం చూసినానూ.. ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో ఉన్న కూడా ఈ భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు, ధర్మమార్గపరుడు స్వకులాచార తత్పరుడు మొదలగు శుభ గుణములు కలిగి వుండును.

పారిజాత యోగము

లాభ స్థానమున (లగ్నము నుంచి 11వ భావమున) శుభగ్రహ ఉంటే ఆ స్థానమును శుభగ్రహము చూసినా, లేదా లాభాధిపతి స్వ, మిత్ర ఉచ్చ క్షేత్రమునందున్ననూ ఈ యొగము కలుగును. విపరీత రాజయోగముగా చెప్పుకునే ఈ యోగము చాలా అరుదుగా జాతకములలో కనిపించును. లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని, ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యంలో సాధారణ జీవితంతో ప్రారంభించి తరువాతి కాలంలో మధ్య వయసు నుంచి అపారమైన గౌరవం, ప్రభువులతో, ధనికులతో సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన, వాహనములు, ప్రబల కీర్తి కలిగి ఉందురు.

త్రిలోచనయోగము

త్రిలోచనయోగములో ఆయుర్దాయము, శత్రువులపై విజయము, వంటి శుభ ఫలములతో, పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగి ఉందురు. రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండును. దీనివల్ల వీరి జీవితం ఏ ఒడుదొడుగులు లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.

ఖ్యాతి యోగము

లగ్నము నుంచి దశమ స్థానమందు శుభ గ్రహము ఉంటే, శుభ గ్రహ వీక్షణ కలిగినను, దశమాధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్థానంలో ఉంటే,  ఈ యోగము కలుగును. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ సుతులతో, సకల సంపదలు కలిగి ప్రజాదరణ, కీర్తి ప్రతిష్టలు కలుగును.

గజకేసరి యోగము

గురుడు లగ్నము నుంచి కానీ చంద్రుని నుంచి కానీ కేంద్రంలో ఉంటే గజకేసరి యోగం అవుతుంది. ఈ గురుడు నీచను పొందక, అస్తంగతుడు కాక, శతృ క్షేత్ర స్థితిని పొందక, మరొక శుభ గ్రయుపతిగానీ వీక్షణ గాని పొంది ఉండాలి. ఇక ఈ యోగము శుభ ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలం పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడపగలరు.

ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్ని అస్థంగత దోషం లేకుండా ఉండాలి. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగి ఉండవలెను.

జ్యోతిష్య రహస్యము

మానవజాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీనమైనది జ్యోతిష్యం. జీవి జీవితంలో జరిగింది, జరగబోతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని చెబుతుంది జ్యోతిష్యం.

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు, నక్షత్రము, నేత్రం,సూర్యుడు అనే అర్ధాలు ఉన్నాయి. అనంత విశ్వంలో మన కంటికి ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది, ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేది.

కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ కాంతి రెండు రకాలు. 1. నక్షత్రాలు, సూర్య, చంద్రులకు సంబంధించిన బయటి కాంతి, 2. ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్ది లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం బోధపడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తు గురించి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం.

భూమి గుండ్రంగ ఆఉందని గ్రీకు శాస్త్రవెత్త టాలెమి కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుంచే మన దేశంలో ఖగోళం అనే పదము వాడుకలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా భారతీయ విద్య. గ్రీకులు, బాబిలోనియా వారు మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే విదేశీయుల వాదన పూర్తిగా సత్యదూరమైంది. ఆయా దేశాలు కళ్లు తెరవక ముందే రుగ్వేదం, యజుర్వేద, సామ, అధర్వణ వేదాదులలో జ్యోతిష్య శాస్త్ర విషయాలు, రహస్యాలు అనేక చోట్ల ప్రస్తవించడం జరిగింది. ఇంతటి విశేషఖ్యాతి వహించిన జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మ దేవునిచే నిర్మించబడినదిగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ శాస్త్రానికి సూర్యుడు, నారదుడు, కశ్యప, అత్రి, గర్గ, మరీచి, మనువు, అంగీరస, పౌలిష, చ్యవన, శైనక, వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు మొదలైన  గురు తుల్యులైన మహర్షి పరంపర ప్రవర్తకులుగా నిలిచారు. ప్రవర్తకులు అంటే శాస్త్ర విషయాలు నిత్య జీవితంలో ఆచరణ స్థానాన్ని కల్పించి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచిన వారు అని అర్థం.

ప్రస్తుత ఆధునిక కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు సులువుగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు విశ్వ విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషంగా అందరిని ఆకర్షించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా, ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.

జ్యోతిష్యంతోనే వేద కార్యకలాపాలు

జ్యోతిష్యం వేదాంగాలలో చివరిది. వేదాన్ని అనుసరించి మనం చేసే యజ్ఞ, యాగాదికాలు ఉంటాయి. వాటిని నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. వాటినే శుభ సమయం లేదా ముహూర్తం అంటారు. ఈ ముహుర్తాలను అనుసరించి, వైదిక కార్యకలాపాలు చేస్తుంటారు. శుభ సమయాలు సౌరకుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాల గమనం మీద ఆధారపడి వుంటాయి. నక్షత్ర, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి వివరించేదే జ్యోతిష్యశాస్త్రం. ఇది లేకుండా వేద కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు.

జ్యోతిష్యం కర్మసిద్ధాంతము

భవిష్యత్తులో జరుగబోయే పరిణామాల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా వాటిని ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ జ్యోతిషశాస్త్రం సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంచి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తుంది. కర్మ సిద్థాంతం 3 రకాలైన కర్మలను గురించి చెబుతోంది. అవి..

  1. ప్రారబ్దకర్మ

గత జన్మలో మానవుడు చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడామే ప్రారబ్ద కర్మ.

  1. సంచితకర్మ

గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించడమే సంచితకర్మ.

  1. ఆగామికర్మ

ఈ జన్మలో మానవుడు చేస్తున్న కర్మల ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించేదిగా మారడమే ఆగామికర్మ.

అంటే మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు.

గడిచిన జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను జ్యోతిష శాస్త్రము సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల ప్రభావాన్ని తగ్గించి మానవుడికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి.. దాంతో మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు లఘు జాతకం అనే గ్రంథంలో కనిపిస్తోంది.

Call Us
× How can I help you?